అమీర్‌పేటలో పలు కోచింగ్‌ సెంటర్లు సీజ్‌

అమీర్‌పేటలో పలు కోచింగ్‌ సెంటర్లు సీజ్‌

user-default Phaneendra Malireddy | Mob: 7794982345 | 14 Oct

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న పలు ఐటీ శిక్షణా కేంద్రాలపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొరడా ఝుళిపించారు. అగ్ని ప్రమాద, విపత్తులను ఎదుర్కొనేందుకు ఎటువంటి భద్రతా చర్యలూ చేపట్టని కారణంగా 20 ఐటీ శిక్షణా సంస్థల్ని సీజ్‌ చేశారు. గతంలో సూరత్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి 23మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందులో భాగంగానే రెండు నెలల కిందట నగరంలోని అమీర్‌పేట్‌, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌, అశోక్‌నగర్‌లో 671 కోచింగ్‌ సెంటర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న వాటిలో 170 కోచింగ్‌ సెంటర్లు తాము అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, ఇతర రక్షణ చర్యలు తీసుకుంటామని.. అందుకోసం కొంత గడువు ఇవ్వాలని కోరాయి. ఈ 170 కోచింగ్‌ సెంటర్లను అధికారులు మినహాయించారు. తాఖీదులు జారీచేసినప్పటికీ ఇంకా స్పందించని.. ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేసిన కోచింగ్ సెంటర్లను సీజ్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నిలువరించేందుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లూ లేకపోగా కనీసం గాలి వెళ్లే అవకాశం లేకుండా ఆయా సంస్థలకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, ఇటువంటి సంస్థలను తాము సీజ్‌ చేసినట్లు విశ్వజిత్‌ వెల్లడించారు. అమీర్‌పేట్‌లోని ప్రముఖ ఐటీ శిక్షణ సంస్థలైన ఎస్‌ఎస్‌ ల్యాబ్స్‌, ఇండెక్స్‌ ఐటీ టెక్నాలజీ, సన్‌స్క్రీన్‌ ‌టెక్నాలజీ, సత్య ఐటీ సొల్యూషన్స్‌, క్యాపిటల్‌ ఐటీ టెక్నాలజీ, ఇమాక్స్‌ టెక్నాలజీ, అవని టెక్నాలజీ, హర్ష టెక్నాలజీ, జేపీఎస్‌ టెక్నాలజీ, ఐనెట్‌ తదితర సంస్థలను సీజ్‌ చేసినట్లు వివరించారు. ఇకపైనా దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved