మాతృ దేవోభవ!...తల్లుల దినోత్సవం!!

మాతృ దేవోభవ!...తల్లుల దినోత్సవం!!

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 17 Sep

తల్లుల దినోత్సవం వెనుక చరిత్ర? ఈ ఒక్క రోజే మాతృ దినోత్సవం అంటున్నారు. సంవత్సరానికి ఒక సారి మాతృదినోత్సవం అని జరుపుకోవడం ద్వారా ఆ ఒక్క రోజూ వృద్ధాశ్రమానికి వెళ్ళి అమ్మని పలకరించి వచ్చేవారు కొంతమంది, ఇంట్లో ఉన్న అమ్మకు ఏదో ఒకటి కొనేసి సరి పెట్టే వారు ఇంకొంత మంది. ఏదో ఒక రోజని కాకుండా ప్రతీ రోజూ మాతృ దినోత్సవం జరుపుకోవడం మన భారతీయ సాంప్రదాయం. గీతలో పరమాత్మ "న మాతుః పరదైవతమ్" అని అన్నాడు. అంటే తల్లిని మించిన దైవం లేదని భావం. తల్లి కాళ్ళకు నమస్కారం చేయడం కోటి యజ్ఞాల ఫలం. సనాతనధర్మంలో తల్లికున్న విలువ ఎనలేనిది. భక్త పుండరీకుని అనుగ్రహించడానికి సాక్షాత్ పాండురంగడు వచ్చినపుడు నేను తల్లితండ్రులకు సేవ చేస్తున్నానని, అదయ్యే వరకూ వేచి యుండమని కృష్ణుని కోరతాడు పుండరీకుడు. శ్రవణ కుమారుడు నడవలేని స్థితిలో ఉన్న తన తల్లి తండ్రులను తానే మోసాడు. ఛత్రపతి శివాజీని వీరుని తీర్చిదిద్దింది తన తల్లి జిజియాబాయి. సన్యాసం స్వీకరించిన యతీశ్వరులకు అన్ని మానవ సంబంధాలూ తెగిపోతాయి. ఒక్క మాతృ సంబంధం తప్ప. అందుకే పీఠాధిపతులందరూ తమ తల్లులకు విధిగా నమస్కరించ వలసినదేనని శాస్త్రం చెబుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ సంస్కృతిలో తల్లి గొప్పదనానికి అంతం లేదు. గ్రీస్‌లో ‘రియా’ అనే దేవతను ‘మదర్‌ ఆఫ్‌ గాడ్స్‌’గా భావించి ఏడాదికోసారి నివాళి అర్పించేవారు. 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్‌లో తల్లులకు గౌరవంగా ‘మదరింగ్‌ సండే’ పేరిట ఉత్సవాన్ని జరిపేవారు. ‘జూలియవర్డ్‌ హోవే’ అనే మహిళ అమెరికాలో 1872లో తొలిసారిగా ప్రపంచ శాంతికోసం మదర్స్‌డే నిర్వహించాలని ప్రతిపాదించింది. అన్న మేరీ జర్విస్‌ అనే మహిళ ‘మదర్స్‌ ఫ్రెండ్‌షిప్‌ డే’ జరిపించేందుకు ఎంతో కృషిచేసింది. ఆమె 1905 మే 9న మృతిచెందగా, ఆమె కుమార్తె మిస్‌ జెర్విస్‌ మాతృదినోత్సవం కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ఇలా 1911 నాటికి అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో మాతృదినోత్సవం జరుపడం మొదలైంది. 1914నుంచి దీన్ని అధికారికంగా నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ నిర్ణయించారు. కాలక్రమేణా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పటినుంచి ఏటా మే రెండో ఆదివారం మాతృదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. మమతకు ఆకారం అమ్మ.. త్యాగానికి నిదర్శనం అమ్మ.. కమ్మనైన పిలుపు అమ్మ.. అమ్మలగన్న పిల్లలారా.. తల్లులు తాకిన బిడ్డల్లారా.. వృద్దాప్యం మరో పసితనం. అమ్మను పిల్లలుగా చూసుకోవడం మాతృ రుణం తీర్చుకునే అవకాశం. అమ్మను అక్కున చేర్చుకోవడం మనందరి కర్తవ్యం. వారిపై ఆత్మీయతను కురిపిద్దాం.. అమ్మలను మురిపిద్దాం.. మళ్ళీ మళ్ళీ మనల్నే కనాలని పరితపిద్దాం. తాను పస్తులుండైనా బిడ్డ కడుపు నింపే నిస్వార్థ ప్రేమ అమ్మకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది. వైకల్యం ఉన్న పిల్లలకు ఒంట్లో జీవం ఉన్నంత వరకు సేవలు చేస్తూ.. తన కష్టాన్ని అమృతంగా అందించే గొప్ప మనసు ఎవరికుంటుంది. బిడ్డ సంతోషం కోసం ఎంతటి కష్టానైనా ఎదుర్కొనేది.. ఎంతటి అవమానాన్నైనా భరించేది అమ్మ మాత్రమే. ప్రతి ఏడాది మే నెలలో వచ్చే రెండో ఆదివారం రోజున ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటారు. లోకంలో అందరికంటే మిన్న అమ్మ.. బిడ్డ కడుపులో పడడంతోనే తల్లిలో మాతృత్వం పొంగుకొస్తుంది. ఇక బిడ్డ భూమ్మీద పడింది. కుడి ఎడమ చేయి అన్న బేధం లేకుండా పిల్లల సేవలో నిమగ్నమై ఉంటుంది అమ్మ. ఆ ప్రేమను చాకిరీ అంటే పొరపాటే. ఆ సేవే తల్లికి సంతృప్తినిచ్చేది. జీవితం ధన్యమైనట్లు భావించేది అమ్మ. పాపాయిని కంటికి రెప్పలా కాపాడుకునేది అమ్మ. రాత్రిళ్ళు కూడా కలతనిద్రలో కనిపెట్టుకొని ఉంటుంది అమ్మ. కన్ననాటి నుంచి కడతేరే దాకా నిరంతరం ప్రేమను పంచుతుంది అమ్మ. ఆ అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమను పంచాల్సిన బాధ్యత మనపై ఉంది. అమ్మను ప్రేమిద్దాం.. ప్రేమ పంచుదాం. భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని అంటారు. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. కొందరు అమ్మతనంలోని కమ్మదనాన్ని దూరం చేసుకుంటున్నారు. ‘నేడు మాతృదినోత్సవం’ సందర్భంగా పిల్లలంతా ఒకసారి తమ బాధ్యతలు గుర్తుంచుకోవాలి. పిల్లల్ని కడుపులో పెట్టుకు చూసే నాటి అమ్మలను ఆదర్శంగా తీసుకోవాలి. ‘‘అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం...’’ అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్న తప్పున చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారథిగా, సారథి తల్లి నిలుస్తుంది. ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ బాధ్యతలు నేడు బహుళంగా పెరిగాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా, సమాజంలో అసమానతలు ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణానికి అనేక బాధ్యతలు చేపడుతుంది. బిడ్డల బాగుకోరుతూ, తను కష్టాలు పడుతూ వారిని కంటిరెప్పలగా కాపాడుకుంటూ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటున్న అమ్మకు మదర్సే డే సందర్భంగా హ్యట్సాఫ్‌. పిల్లల బాధ్యత తండ్రి కంటే తల్లికే అధికంగా ఉంటుంది. అటు ఇల్లును చక్కబెడుతూనే... ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ...ఇటు చిన్నారుల విషయంలో కూడా శ్రద్ధ్ద తీసుకోవడంలో అమ్మదే ప్రధాన పాత్ర. పిల్లల విషయంలో ఆత్మసైర్థ్యం కలిగించాల్సిన పెను బాధ్యత కూడా ఆమెపైనే ఉంటుంది. పిల్లలు ప్రాణాపాయస్థితిలో ఉన్న సమయంలో తను ప్రాణాలను అర్పించైనా పిల్లలను కాపాడేందుకు సాహసించేది ఈ సృష్టిలో అమ్మ ఒక్కటే. తాను పస్తులుండైనా సరే పిల్లల కడుపు నింపుతుంది. అమ్మను మించిన దైవం మరోకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఎంత పెద్ద తప్పు చేసినా...చివరికి ఆమెను పట్టించుకోకపోయినా... క్షమించే గుణం అమ్మకు మాత్రమే ఉంది. తుదిశ్వాస విడిచే వరకు పిల్లల క్షేమం కోరుకునేది అమ్మ మాత్రమే. ఇంతటి అపూరూపమైన అమ్మ కోసం మదర్స్ డేను సంవత్సరానికీ ఒకసారి కాదు ప్రతీ రోజు జరుపుకొని మాతృమూర్తులను సంతోషంగా ఉంచుదాం.....

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved